నేలను కప్పి ఉంచితే మేలు!

నేలను కప్పి ఉంచితే మేలు!
ఇంటి పంట 08 -04 -2011

ఎండ ధాటికి, చలికి, వర్షాలకు మనం శరీరాన్ని వస్ర్తాలతో రక్షించుకుంటున్నాం. కూరగాయలు, ఆకుకూర మొక్కలు పెరుగుతున్న మడులు, కుండీలలో మట్టిని ఎండ / వర్షం / చలి నుంచి కాపాడుకోవడం కూడా అవసరమే కదా! ఆకులు అలములతో, మొక్కలతో భూమిని కప్పి ఉంచడాన్ని ‘మల్చింగ్’ అంటారు.

వరి గడ్డి, చెరుకు పిప్పి, కొబ్బరి పీచు వంటి ఏ సేంద్రియ (కాలక్రమంలో కుళ్లి భూమిలో కలిసిపోయే) పదార్థంతోనైనా మల్చింగ్ చేయవచ్చు. ఎండాకాలంలో ఏ పట్టణంలోనైనా చెరకు రసం అమ్మే స్టాళ్లు ప్రతి వీధి మలుపుల్లోనూ కనిపిస్తుంటాయి. అక్కడి నుంచి బస్తాలతో చెరుకు తుక్కు(ఉచితంగానే)ను తెచ్చుకోవచ్చు. పీకేసిన కలుపు మొక్కలు, రాలిన ఆకులు, చొప్ప కూడా ఉపయోగించవచ్చు. మల్చింగ్ ద్వారా భూసంరక్షణ సాధ్యమవుతుంది. భూసారం పెరుగుతుంది. పట్టణాలు, నగరాల్లో మొక్కలు పెంచుకునే వారు మల్చింగ్ ద్వారా నీటి కొరతను కూడా అధిగమించవచ్చు.

మల్చింగ్ ఉపయోగాలు
ఎండ వేడిమి నేరుగా భూమికి తగలకపోవడం వల్ల నేలలోని తేమకు, సూక్ష్మజీవులకు నష్టం లేదు.

వర్షం కురిసేటప్పుడు చినుకులు నేరుగా కుండీ, మడిలోని నేలను ఢీకొట్టడం వల్ల కలిగే నేలగట్టిదనాన్ని తప్పించుకోవచ్చు.

వర్షపు నీరు పక్కలకు పోవడానికి ఆకులు, గడ్డి మొదలైనవి అడ్డుతగలటం వల్ల భూమిపై ఎక్కువసేపు తచ్చాడుతూ నేలలోకి ఇంకుతాయి.

భూమిపై కప్పే ఆకులు మొదలైన సేంద్రియ పదార్థాలు కుళ్లిపోతుంది. ఈ ప్రక్రియలో అది నేలకు పోషకాలను అందిస్తుంది. మల్చ్ ద్వారా నే లకు సూక్ష్మపోషకాలన్నీ సమపాళ్లలో అందుతాయి.

నేలపై మల్చ్ ఉంచడం ద్వారా కలుపును అదుపులో ఉంచవచ్చు. 5 సెం.మీ. మందం మల్చింగ్
వే స్తే కలుపు 90 శాతం తగ్గుతుంది.




ఇంటి పంటల సాగులో ఎదురవుతున్న సమస్యలకు సమాధానాలివ్వడానికి నిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారు.

సుస్థిర వ్యవసాయ కేంద్రం (తార్నాక, సికింద్రాబాద్): 040- 27014302 / 27017735 (అన్ని పనిదినాల్లో సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకూ). అగ్రి. హార్టీకల్చరల్ సొసైటీ అధ్యక్షులు మిద్దెల అనంతరెడ్డి: 92461 08262 (ఏరోజైనా సాయంత్రం 2 గంటల నుంచి 4 గంటల వరకూ). సీనియర్ సిటీ ఫార్మర్ వేగేశ్న రామరాజు: 040- 2371 6633, 94401 92377 (సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య ఏ రోజైనా).

‘ఇంటిపంట’ పాఠకులు నిపుణులను సంప్రదించడం కోసం, తమ అనుభవాలను పంచుకోవడం కోసం గూగుల్‌గ్రూప్స్.కామ్‌ను వినియోగించుకోవచ్చు. intipanta@googlegroups.comకు మెయిల్ పంపితే చాలు ఈ గ్రూప్‌లో సభ్యులు కావచ్చు. ఈ మెయిల్ ఐడీకి సభ్యుల్లో ఎవరు ఎవరికి మెయిల్ ఇచ్చినా.. దాని కాపీ ఆటోమేటిక్‌గా అందరికీ వస్తుంది.

రేపే నాగార్జున నగర్‌లో ‘ఇంటి పంట’ వర్క్‌షాప్
ఎల్లారెడ్డిగూడలోని నాగార్జుననగర్ సంక్షేమ సంఘం హాలు(23750486)లో ఈ నెల 9 శనివారం సాయంత్రం (4 గంటల నుంచి 7 గంటల మధ్యలో) ఇంటి పంట వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ’, నాగార్జున నగర్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనదలచినవారు 040 23303849 నంబర్‌కు ఫోన్ చేసి పేర్లు నమోదుచేయించుకోవచ్చు.